నేను తెలంగాణ ఉద్యమచరిత్ర గురించి చదువుతున్నప్పుడు తడవుగా వచ్చిన ఒక ఆలోచన .అరే..తెలంగాణలో ఎందరో కవులు రచయితలు, ఉన్నారే.. కనీసం వారి గురించి, వారి రచనల గురించి చదివే, తెలుసుకునే అవకాశమే రాలేదే అని. తెలంగాణ చరిత్ర చదువుతున్న ఎవరికైనా సరే అరే… ఇంత చరిత్ర ఉందా …! కొందరు వ్యక్తులు… సామాన్యులను ఇంత దగా చేసారా… ?ఇంత అమాయకత్వం ఉందా అని కొంతైనా అని అనిపించక మానదు. అందులో లీనమైతే ఇసుమంతైనా పౌరుషం, జాలి జాలువారక ఉండదేమో…!
అలా సమయం చిక్కినప్పుడు చదివిన పుస్తకమే. ‘మోదుగుపూలు’, దాశరథి రంగాచార్య గారు రాశారు. అప్పటి నిజాం పరిపాలన నాటి సామాజిక పరిస్థితులకు తగట్టు రాసిన నవల.ఈ నవలలో ఉన్న విషయాలు ఇప్పుడు మనం ఉద్యమచరిత్ర చదవడం ద్వారా కొన్ని సినిమాలు,కథల ద్వారా పెక్కుమందికి తెలసియుండొచ్చు. కానీ, ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు మొదటిసారి ఒక పుస్తక సమీక్ష చేయాలనిపించింది. దీనికంటే మంచి తరుణం ఇంకేంముంది.!
ఈ కథ నల్గొండజిల్లా ఒక ఊరిలో మొదలవుతుంది.తెలంగాణలో నిజాం రాజ్యంలో జాగిర్దార్ వ్యవస్థ తెలియనిది కాదు.జాగీరుల క్రింద గ్రామాలు ఉంటాయి. అతనికి తోడు తాసిల్దార్, గిర్ధావర్, అమీన్. ఇది ఒక నిరంకుశ వ్యవస్థ .తాసిల్దార్ అన్వర్బేగ్ కర్కోటకుడు. మహిళ, మందు, మత్తు,మజా ఇవి అతని ప్రపంచం. పేదల రక్తపుస్వేదం అతనికి జాలువారే కాసులు.ప్రతి ఊరిలో ఉండే ఒక స్వార్థ పూరిత శావుకారు వెంకయ్య, అదను చూసి లాభపడే గిర్ధవర్ కులశేఖర్ .
మహాత్మా గాంధీ గారు నల్లజాతీయుడని రైలునుండి గెంటేస్తే అది ఒక దేశచరిత్ర నే మార్చేసించి . అలాగే ఈ గ్రామంలో ఒక ఆదర్శ పాత్ర రఘు, అతను పత్రిక ఊరిలోకి తెస్తేనే అతన్ని చితకబాదిన అమీన్(SI).అలాంటి పత్రికలు ఎన్నో వచ్చేలా చేసి ఆ ఊరి ఆలోచనలనే మార్చేస్తాడు. అదే అమీనుకు అందజేస్తాడు.ఈ ఊరిలో ఇంకోపాత్ర నాగేష్ విప్లవ బావుటా ఎగరేద్దామంటాడు.కానీ “చరిత్ర రాసేది రక్తంకాదు..త్యాగాలు,పోరాటాలు,సమాజం మార్పు” అని నాగేష్ తో కలిసి ఊరిలో ఒక సహాయ నిరాకరణమే చేస్తాడు. “తప్పు వ్యవస్థది అయినప్పుడు, నాశనం చేయాల్సింది వ్యవస్థను మనుషులని కాదు” అంటాడు. జానకి, రఘు మరదలు తను భూస్వామ్య కుటుంబం నుంచే అయినా ప్రజలకు తన భూమిని పంచి బావ పారాటానికి ఊపిరిలూదుతుంది .ఒక మహిళ కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. వీరయ్య జానకి తండ్రి, రఘు ఆలోచనలను ఆశయాలను అర్థం చేసుకుని తను ఆ బాటలో నడుస్తాడు. కరువు వస్తే ధాన్య బాంఢాగారం పంచేస్తాడు.ఇతను మారే సమాజానికి మొదటి ప్రతినిధి.
గ్రామాల పునాది, చిరువ్యాపారులు వడ్డెర్లు, మంగళి, చాకలి మొదలగు వారు.రఘు, జానకి, నాగేష్ ఇచ్చిన చైతన్యంతో వారు ఒక్క రోజు పని మానేస్తే తహసీల్దార్ పునాదులు కదిలాయి,గ్రామం నిర్జీవమైంది.
ఈ నవలలో ఆశ్చర్య పరిచింది,తెలుసుకుంది కోయలు వారి ఆచారాలు,వివాహ వ్యవస్థ.ఒక పులినే చంపగలిగిన కోయ సింగడు తాసీల్దార్ అరాచకం ముందు పిల్లి అయ్యాడు.అంటే ఒక వ్యవస్థ ఎలాంటి వ్యక్తినైనా తన పాదాక్రాంతం చేస్తుందా..!
ఓటు వేసేవరకేనా కర్తవ్యం ,కార్యానికి కొందరి కాళ్లకు మోకరిల్లుతున్నామా ఇప్పటికీ…! అని అనిపించక మానదేమో…!
కథ సాగుతూ ఉంటే రఘును ఒక ఫర్జీ కేసులో డబ్బు తిన్న జిల్లా పోలీసు మెహతమీమ్ అరెస్టు చేసి చిత్రహింస పెడతాడు. విషయం రాజ్యం అంతా తెలిసే సరికి మెహతమీమ్ ప్రాయశ్చిత్త పడతాడు. చేసిన తప్పు తెలుసుకొని రఘు ముందు మోకరిల్లుతాడు.తనకు శిక్షపడేలా చేయమంటాడు…. కాని మెహతమీమ్ ను రఘు క్షమిస్తాడు… ఎంక్వైరీకి వచ్చినప్పుడు మెహతమీమ్ కి వ్యతిరేకంగా ఏమీ చెప్పుడు .
“శాసనం పశ్చాత్తాపము ఎరుగదు. మనిషిగా నేనుదాన్ని గుర్తించకుండా ఉండలేను అంటాడు”
ఇది నేటికి నిజం అనిపించింది. ఎన్ని శాసనాలు చేసినా మనిషికి నేడు లేనిది పశ్చాత్తాపము. ఏ శిక్ష ఏ శాసనం అత్యాచార కేసుల్లో నేరస్తులను మార్చింది..? సమాజంలో మార్పు తెచ్చింది. ఇంకా జరగుతున్నాయ్ కదా… ఇది తలచుకుంటే మన విలువలను ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంది…!ఎన్ని చేసినా ఏ సహాయనిరాకరణము చేసినా జనాల బ్రతుకులు తెలంగాణ గ్రామాల్లో అప్పుడు పెద్దగా మార్పు తేలేకపోయిందా…! 1946 లో ఖాసింరజ్వీ ఆగడాలతో రఘుకి తన సిద్ధాంతలపైనే ప్రశ్న మొదలైంది.
“అసలు మనిషి ప్రాణాలే ముఖ్యం సమస్య వ్యవస్థది కానీ అది నడిపించే వ్యక్తిది కాదు” అని నమ్మిన ఒక సిద్ధాంతం … తన మూలాలనే ప్రశ్మించేంత పరిస్థితిలో చిక్కెన వైనం చూస్తాం…
యావత్తు భారతదేశాన్ని కదిలించిన సత్యాగ్రహం – తెలంగాణ గ్రామాలను కదిలించలేకపోయిందా… ! దానికి కారణం మతం పెట్టిన చిచ్ఛా లేక వ్యవస్థ పెట్టిన చిచ్చా…అర్ధంకాని సందిగ్ధంలో ఉంటాం.
అబల బలి అవుతుంటే, మానవత్వం తగలబడి పోతుంటే, దగాకోరు రజాకారు రక్తాన్ని పీల్చుతుంటే నిస్సహాయుడైన రఘ నాగేష్ తో కలిసి విప్లవ బాట పడతాడు..
చివరకు కలం పట్టిన చేయి, కత్తి పట్టింది,వ్యవస్థ మార్చడానికి తుపాకీ ఎక్కు పెట్టింది, పెత్తందారులను ఊరి నుండి తరిమికొట్టింది.
తుదకు మనిషిని మనిషే చంపుకునేంత ఆటవికత బయలుదేరినప్పుడు ఆయుధమే చైతన్యాన్ని తట్టి లేపి ప్రతి చెట్టుని,చేమని,పుట్టని,మట్టిని మేల్కొలిపిందా..!
వ్యవస్థ ఆటవికం అయితే ఆయుధమే చివరి సమాధానమా….!
భారతదేశంలో స్వతంత్య్రపోరాటం విజయం సాధిస్తే, తెలంగాణలో గ్రామ విప్లవపోరాటం విజయం సాధించిందా..!
అక్షరం మేలు కొలిపితే ఆయుధం…చరిత రాసిందా ..!
చివరకు మారింది వ్యవస్థ అనిపించినా, మారింది మనుషుల బట్టలు, వారి అధికారం, “మరీ ఈ పెత్తందారి వ్యవస్థపోదా… నిజమైన బలహీన వర్గాలు, బడుగుల రాతమారదా…!
అన్న ఎన్నో ప్రశ్నలను చివరకు ఈ నవల మనలో లేవనెత్తుతూ కథ ముగుస్తుంది …కాదు…కాదు అప్పుడే కథ మొదలవుతుంది….!
(మీరు కూడా ఒకసారి ఈ పుస్తకం చదివి మీ అభిప్రాయాన్ని comment ద్వారా తెలపండి.)






Leave a Reply